న్యాయమూర్తుల నియామకం తొలగింపు పై సమగ్ర విశ్లేషణ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్‌గా వున్న జస్టిస్ ఎన్‌వి రమణ పైన, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరితో సహా మరికొందరిపైన ముఖ్యమంత్రి జగన్ బహిరంగ ఆరోపణలు చేయడం దానిపై వివిధ ప్రసార మాధ్యమాల్లో ఎంతో మంది మేధావులు తమ విశ్లేషణలు తెలియాచేయడం గత కొన్నిరోజులుగా ప్రజలందరూ గమనిస్తున్నారు . అయితే ఒకోకరు ఒకొక అభిప్రాయాన్ని వెలువరించడం వలన అసలు న్యాయమూర్తుల నియామకం ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా వారిమీద ఆరోపణలు వచ్చినప్పుడు వారిని ఏ విధంగా పదవినుండి తొలగించాలి అనే విషయాలను కూలంకషంగా తెలుసుకుందాం. ఒక దేశ ఔన్నత్యాన్ని, నాగరికతను ఆదేశ న్యాయవ్యవస్థ పనితీరులో చూడవచ్చని' లార్డ్బ్రైస్ పేర్కొన్నారు. మనదేశం ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థను అనుసరిస్తుంది. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, దాని కింద రాష్ట్రస్థాయిలో హైకోర్టులు, వాటి కింద స్థానిక స్థాయిలో సబార్డినేట్ కోర్టులు ఉన్నాయి. దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి.
భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏకీకృత, సమన్యాయ పాలనను; అమెరికా రాజ్యాంగం నుంచి న్యాయసమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థను గ్రహించారు.
నియామక ప్రక్రియలు :
ఆర్టికల్ 124 ప్రకారం- రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. 1982లో ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చిన తీర్పు ప్రకారం- జడ్జిల నియామకంపై మిగతా జడ్జిలను సంప్రదించడం అనేది కేవలం సంప్రదాయమే అనీ, కార్యనిర్వహణ శాఖకే పూర్తి అధికారం ఉంటుందని పేర్కొంది. 1993లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో (1993 (4) ఎస్సీసీ 441). జస్టిస్ జేఎస్ వర్మ వెలువరించిన తీర్పు ప్రకారం మెజారిటీ విశ్లేషించినదేమిటంటే, న్యాయమూర్తిగా నియమించడానికి సిఫారసు చేయదలిచిన వ్యక్తులలో ప్రతికూల లక్షణాలు ఉంటే వాటిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లడమనే పాత్రకు మాత్రమే కార్యనిర్వాహక వ్యవస్థ పరిమితం కావాలి. దీనితో కార్యనిర్వాహక వ్యవస్థ పాత్ర నిష్ఫలమైంది. ఈ కేసునే సెకెండ్ జడ్జస్ కేసు అని పేర్కొంటూ ఉంటారు. రాజ్యాంగ ధర్మాసనం. సంప్రదించడం అంటే జడ్జిలు ఒప్పుకోవడమని తీర్పునిచ్చింది. దీని ఆధారంగానే కొలీజియం వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కొలీజియం న్యాయమూర్తుల నియామకంలో చట్టబద్ధమైన అధికారం కలిగిన సంస్థ అయింది. కొలీజియం సిఫారసులను కొట్టివేసే అధికారం ఏ కోర్టుకు లేదు. కోలీజియం సిఫారసుల మేరకు నియామకాలు జరపడానికే న్యాయ సమీక్షకు ఉన్న అధికారం పరిమితమైంది. న్యాయమూర్తుల నియామకంలో మంత్రి మండలి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం కూడా లాంఛనంగా మారింది. కొలీజియం సిఫారసులను కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్రపతికి తెలియ చేస్తే ఆయన నియామకాలు చేపడతారు. ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే సెకెండ్ జడ్జస్ కేసులో మెజారిటీ తీర్పును రచించిన జస్టిస్ జేఎస్ వర్మ తరువాత తన అభిప్రాయం మార్చుకున్నారు. న్యాయమూర్తుల నియామకాలను జాతీయ జ్యుడీషియల్ కమిషన్ చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి/ప్రధాని/ భారత ప్రధాన న్యాయమూర్తి తదితరులు ఇందులో సభ్యులుగా ఉండాలని ఆయన చెప్పారు. 1998లో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ న్యాయమూర్తుల అభిప్రాయం ప్రకారం- జడ్జిల నియామకం జరగాలని మరో ధర్మాసనం సూచించింది. అందులో మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం నియామకాలు జరగాలని చెప్పింది. అధికరణ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ‘కొలీజియం’ను రాష్ట్రపతి సంప్రదిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించి ప్రత్యేక అర్హతలు పేర్కొనలేదు. సాధారణంగా సీనియర్ న్యాయమూర్తిని నియమిస్తారు. కానీ ఇది తప్పనిసరి కాదు. ప్రధాన న్యాయమూర్తి నియామకం. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ రాష్ట్ర గవర్నర్, న్యాయమూర్తిని నియమిస్తున్న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రతించిన తరువాత రాష్ట్రపతి చేపడతారు. హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే తీరులోనే ఉంటుంది. దీనిని గురించి ఆర్టికల్ 217(1) వివరిస్తుంది.
- సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్ను ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించడం ఒక సంప్రదాయం. కానీ 1973లో ఇందిరా గాంధీ ప్రభుత్వ సిఫారసుల మేరకు సీనియర్ న్యాయమూర్తులైన జె.ఎం. షేలట్, ఎ.ఎన్. గ్రోవర్, కె.ఎస్. హెగ్డేలను విస్మరించి 4వ స్థానంలో ఉన్న జూనియర్ అయిన ఎ.ఎన్. రేనును ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
- 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ సిఫారసుల మేరకు సీనియర్ న్యాయమూర్తి హెచ్.ఆర్. ఖన్నాను కాదని, జూనియర్ అయిన ఎమ్.హెచ్. బౌగ్ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
న్యాయమూర్తుల తొలగింపు విధానం :
సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల తొలగింపు కోసం 1968లో పార్లమెంట్ న్యాయమూర్తుల దర్యాప్తు చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం పరిధిలో 1969లో వారి తొలగింపు విధివిధానాలను రూపొందించింది. రాజ్యాంగ ప్రకరణ 124(4) న్యాయమూర్తులను తొలగించే విధానాన్ని తెలుపుతోంది. న్యాయమూర్తులకు సంబంధించి ఏదైనా అసమర్థత, అక్రమ ప్రవర్తనను గుర్తిస్తే.. పార్లమెంట్ అభిశంసన తీర్మానం సిఫారసు మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు. ఈ తీర్మానాన్ని 100 మంది సభ్యుల మద్దతుతో లోక్సభలో లేదా 50 మంది మద్దతుతో రాజ్యసభలో 14 రోజుల ముందు సభాధ్యక్షునికి నోటీస్ ఇచ్చి ప్రవేశ పెట్టవచ్చు. సభాధ్యక్షుడు దీన్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. తీర్మానాన్ని ఆమోదిస్తే సభాధ్యక్షుడు విచారణ కమిటీని నియమిస్తారు. విచారణలో అభియోగం రుజువైతే తీర్మానం చర్చకు వస్తుంది. అనంతరం ఉభయ సభలు విడివిడిగా 2/3 మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రపతి సంబంధిత న్యాయమూర్తిని తొలగిస్తారు. ఇంతవరకు ఈ విధంగా ఎవరినీ తొలగించలేదు. 1993లో జస్టిస్ వి.రామస్వామిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ ఇది నెగ్గలేదు. 2011లో జస్టిస్ సౌమిత్రసేన్పై తీర్మానం ప్రవేశ పెట్టగా రాజ్యసభలో నెగ్గింది. ఈ తీర్మానం లోక్సభకు రాకముందే ఆయన రాజీనామా చేశారు. రాజ్యాంగం 121,211 అధికరణాలు జడ్జి అభిశంసన చేసేప్పుడు తప్ప ఇతరత్రా జడ్జి ప్రవర్తన గురించి పార్లమెంటులో గాని శాసనసభలో గాని చర్చించరాదని చెబుతున్నది.
రాజీనామా:
ప్రకరణ 124 (2ఎ) ప్రకారం - సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రకరణ 217 (ఎ) ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులు, వారి రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
ఇట్లు
మీ
ప్రజల మనిషి
సుంకర నరేష్
9206234234
Comments
Post a Comment