యువత ప్రేమ, పరువుహత్యలకు చిరునామానా....?
ప్రపంచంలోనే అత్యధికసంఖ్యలో యువత ఉన్న దేశంగా భారతదేశానికి పేరుంది. దేశ జనాభాలో 54 శాతం మంది 25 సంవత్సరాలు లోపు వారే అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్న రెండో దేశం భారత్ (63 కోట్ల మంది). అంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ మొదటిస్థానాన్ని పోటీ పడుతున్నాం. ఇవన్నీ నాణానికి ఒక వైపే రెండు వైపు ఏముందో ఒకసారి తిప్పి చూస్తే ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు , రక్తపు మరకలు , మాంసపు ముద్దలు, మాడిమసైపోయినా దేహాలు ఎవరివి అనుకుంటున్నారా , రాజకీయనాయకులు ఎన్నికలప్పుడు ఓట్లకోసం, గెలిచాక వచ్చిన నిధులను మింగేయగా చేయడానికి ఏమిలేనపుడు స్వచ్చందంగా ముందుకు రావాలి అని పిలుపునిస్తే వెనకా ముందు ఆలోచించకుండా వచ్చేస్తామే మేమేనండి యువత, బూడిద పాలౌతున్న మా జీవితాలే గురించే ఈ చర్చంతా. యువత మీద మన దేశంలో రోజు రోజుకూ కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగిన ఈ హత్యలు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. మా రోజుల్లో అని వయసుమళ్ళిన పెద్దోళ్ళు చెప్పే రోజుల నుండి ఇది మా తరం అని చొక్కా కాలర్ ఎగరవేసి చెప్పే నేటి వరకు అదే కత్తిపోటు. రెండు విభిన్న కులాలు , ఆర్థిక అసమానతలు కలిగిన ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న యువతీ యువకులను కలిసి జీవించకుండా నడిరోడ్డుమీద నరికి, కారు చీకట్లో గొంతునులిమి, కర్కశంతో కిరోసిన్ పోసి తగులబెట్టి చంపేసే తల్లిదండ్రుల కధనాలు విదితమే. ఏం సాధించడానికి ఈ పరువు హత్యలు. పరువు కోసం పాకులాడి, ప్రాణాలు తీసి, జీవితం జైలుపాలు చేసుకొని... అయినవాళ్లు సాధించేదేంటి? 'కని పెంచి మిమ్మల్ని ప్రయోజకులుగా చేసిన మమ్మల్నే తిరస్కరిస్తారా' అనే తట్టుకోలేని భావనతో తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు. కానీ వయసొచ్చిన పిల్లల ఆలోచనల్లో మార్పులు వస్తాయని ఆలోచించట్లేదు. మామాటే వినాలి, మేం చెప్పినట్లే నడుచుకోవాలనే ధోరణి... పంతాలకు దారితీసి, ప్రాణాలను హరిస్తోంది. తమకు ఇష్టం లేని వివాహాలు చేసుకున్నారని నవ దంపతుల్ని హత్యలు చేయడానికి తల్లిదండ్రులు వెనుకాడకపోవడం అత్యంత దారుణమైనా విషయం.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగుకు చెందిన అనురాధ వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకుందని ఆమె సొంత తల్లితండ్రులే కొట్టి చంపి దహనం చేసిన సంఘటన కానీ, నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన ప్రణయ్-అమృత వర్షిణి లా ఉదంతం కానీ, అదే జిల్లాకు చెందినా స్వాతి-నరేష్ కథ ఇప్పటికీ, ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేని విషాదం. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం మండలానికి చెందినా ఇంద్రజ, చైతన్య వ్యవహారంలో అబ్బాయి దళితుడు కావడంతో అమ్మాయి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు రాత్రికి రాత్రే ఉరేసి చంపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆమె మృతదేహాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి తగులబెట్టారు. నిన్నటికి మొన్న హైదరాబాద్ గచ్చిబౌలి లో ప్రాంతం లో ప్రేమవివాహం చేసుకుని నివసించే హేమంత్, అవంతిలా విషయంలోను ఆమె తల్లి తండ్రులు హేమంత్ ని దారుణంగా చంపినా సంఘటన ఇంకా ప్రతిఒక్కరి కంటి ముందు కదిలాడుతూనే ఉంది. ఇలా తెరపైకి వచ్చినవి కొన్ని మాత్రవే రానివి కోకోల్లలు. పరువు, ప్రతిష్ట అన్న మాయలో పడి కన్నబిడ్డల్నే చిదిమేస్తున్న తండ్రులున్నారు. అల్లుళ్లను హతమారుస్తున్న మామలున్నారు. పేగుతెంచుకుపుట్టిన బిడ్డ అన్న ఆలోచన లేకుండా తల్లులే బిడ్డల గొంతు నులిమి చంపేస్తున్నారు.
గత రెండు దశాబ్దాల్లో 44,412 హత్యలు ప్రేమ-పెళ్ళి వ్యవహారాల్లో జరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గ్రామాల్లో ముప్పై శాతం, పట్టణాల్లో ఇరవై శాతం కుటుంబాలు అంటరాని తనాన్ని పాటిస్తున్నాయని, మొత్తం వివాహాల్లో కులాంతర వివాహాలు ఐదు శాతంలోపేనని నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్ఛ్ పరిశోధన వెల్లడించింది. ఈ హత్యలను నివారించాలని సుప్రింకోర్టే సూచించినప్పటికీ ఖాఫ్ పంచాయతీల దరి చేరడానికి ప్రభుత్వాలు సాహసించడం లేదు. కుల అంతరాలు పోవాలంటే కులాంతర వివాహాలు జరగాలన్నారు డా. బి .ఆర్. అంబేద్కర్. 2006లో ఒక పరువు హత్య కేసు ఘటనలో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ- ‘ఈ తరహా హత్యల నిరోధానికి కఠిన చట్టాలు అవసరం ’ అని పార్లమెంటుకు గుర్తు చేసింది. అయినా అలాంటి చట్టాలు తీసుకురావట్లేదు మన నాయకులు. ఇదొక సామాజిక జాఢ్యం. దీనికి సంబంధించి పబ్లిక్గా మాట్లాడేందుకు రాజకీయ నేతలు, ఉద్యమకారులు, ప్రజా హక్కుల సంఘాల నేతలు ఇష్టపడరు. వీటితో ఓటు బ్యాంకు రాజకీయాలు ముడిపడి ఉంటాయి. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళెవరూ ఎన్నికల్లో గెలువడానికి పార్టీలకు నోట్లకట్టలు సమకూర్చే పెట్టుబడి దారులు కాకపోవడం కూడా ప్రధానమయినా కారణం. ఒక పురుషుడు, ఒక స్త్రీ.. తమ కులాలకు, మతాలకు అతీతంగా, ఎలాంటి కుల, మత మార్పిడి అవసరం లేకుండా తమ పెళ్లిని చట్టపరంగా నమోదు చేసుకోవచ్చని 1954 లోనే ప్రత్యేక వివాహ చట్టం చేసారు మన పాలకులు.
అయితే ‘పరువు హత్యలు’ అంటే ముందుగా గుర్తుకొచ్చే రాష్ట్రమయిన ‘రాజస్థాన్’లో గత ఏడాది The Rajasthan Prohibition of Interference with the Freedom of Matrimonial Alliances in the name of Honour and Tradition Bill, 2019 ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ‘పరువు హత్య’ నేర నిరూపణ అయితే, నేరస్తులకు మరణ దండన, లేదా యావజ్జీవ కారాగార శిక్ష వరకూ విధించే అవకాశం ఉంది. చట్టాలు చేయడంతో పాటుగా ఇటువంటి విషయాలపై సమాజంలో ప్రజలకి విస్తృతమైన అవగాహనా కార్యక్రమాలు కల్పించాల్సినా అవసరం, ఆ విధంగా సామజిక జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుసుకురావాల్సిన అవసరం ఫ్రభుత్వాలపైనే ఎంత ఉందో, సామాజిక కార్యకర్తలు, ప్రసారమాధ్యమాలు మీద కూడా అంతే ఉంది.
ఇట్లు
మీ
ప్రజల మనిషి
సుంకర నరేష్
9206234234
Comments
Post a Comment